దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేలకు కార్యాలయం, నివాస వసతితో కూడిన భవన సముదాయాల పనులు ఊపందుకున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం కేంద్రంలో రూ.69 లక్షల వ్యయంతో భవన సముదాయం సిద్ధమైంది. ఇవాళ ఈ భవనాన్ని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్ ప్రారంభించారు.
ఎమ్మెల్యేలకు వసతి, కార్యాలయంతో కూడిన నిర్మాణాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కో వసతి గృహ నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆర్ అండ్ బీ శాఖ యుద్ధప్రాతిపదికన నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసతి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వసతి గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే అవి కూడా పూర్తికానున్నాయి.
పరకాలలో వసతి గృహ నిర్మాణానికి గతేడాది అగస్టు 30న శంకుస్థాపన చేశారు. 9నెలల కాల వ్యవధిలో రూ. 1కోటి ఖర్చుతో నిర్మించాలని భావించారు. అయితే అనుకున్న దానికన్నా తక్కువ సమయం, తక్కువ ఖర్చుతోనే అనుకున్న విధానంగా వసతి గృహాన్ని నిర్మించారు. ఆరు నెలల కాలంలో, రూ. 68,92,448 ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసి సత్తా చాటారు. ఈ నిర్మాణాన్ని 2800 చదరపు గజాల విస్తీర్ణంలో శాసన సభ్యుని వసతి, కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అయితే 4533చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తు కార్యక్రమాలకు, రెండో అంతస్తు కుటుంబానికి కేటాయించారు.
మొదటి అంతస్తు: మీటింగ్ హాల్, ఎమ్మెల్యే కార్యాలయం, వీఐపీ లాంజ్, అతిథులు వేచి ఉండే గదులు, పీఏ, పీఎస్‌లకు ప్రత్యేక గదులు, రిసెప్షన్, భద్రతా అధికారులకు గదులు
రెండవ అంతస్తు: మాస్టర్ బెడ్‌రూం, పిల్లల బెడ్‌రూం, డైనింగ్ కం లివింగ్ స్టోర్స్, టాయ్‌లెట్లు, సిట్‌అవుట్, పూజగది
దీంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ప్రజలు నివసించే చోటే నివసించి 24 గంటలూ అందుబాటులో ఉండాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరబోతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వసతి భవనాలను సిద్ధం చేస్తున్నారు.