అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మక బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) గుర్తుతెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం భయాందోళనకు గురైంది.
యూనివర్సిటీ ప్రొవోస్ట్ (సీనియర్ అధికారి) ఫ్రాంక్ డోయల్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంజనీరింగ్ భవనంలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడంతో, అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో వెంటనే క్యాంపస్ అంతటా లాక్‌డౌన్ ప్రకటించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read:మలయాళం నటి లైంగిక దాడి కేసు!
ఈ కాల్పుల ఘటనపై బ్రౌన్ యూనివర్సిటీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విద్యార్థులు, అధ్యాపకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది. అమెరికాలో తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనకు దారి తీస్తున్నాయి.

