గుజరాత్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎన్నికల్లో సోనియా రాజకీయ సలహాదారు కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు రాజ్యసభ స్థానాల్లో బీజీపీ రెండు స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ రాజ్యసభ స్థానాల్లో గెలుపొందారు.
రాజ్యసభకు ఐదోసారి ఎన్నిక కావడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన పటేల్ తన తర్వాతి టార్గెట్ గుజరాత్ అంటూ ఉద్విగ్నంగా మాట్లాడారు. తనను గెలిపించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఓడించేందుకు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు అధికార బలాన్ని ఉపయోగించారని ఆరోపించారు. ఇది తాను సాధించిన విజయం కాదని, రాష్ట్రంలో విచ్చలవిడి డబ్బు పంపకం, అధికారం ఓటమి పాలయ్యాయని అభివర్ణించారు.
అమిత్ షా, స్మృతి ఇరానీ 4600 ఓట్లు చొప్పున పొందగా..అహ్మద్ పటేల్ విజయానికి కావాల్సిన 4400 ఓట్లను పొందారు. దీంతో అహ్మద్‌పటేల్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేలడంతో తొలుత ఎన్నికల కౌంటింగ్ నిలిపివేసిన ఈసీ..ఆ తర్వాత కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించింది.