కౌంటింగ్‌:తొలుత ఖమ్మం..చివరిగా నిజామాబాద్

262
election-counting
- Advertisement -

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అధికారులకు శిక్షణ కార్యక్రమం పూర్తిచేసింది ఈసీ. కౌంటింగ్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఆదేశాలు జారీచేశారు.

17 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొనగా ఏ నియోజకవర్గం ఫలితం ఫస్ట్ వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం కౌంటింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తే తొలుత ఖమ్మం ఫలితం రానుండగా చివరగా నిజామాబాద్ ఫలితం వెలువడనుంది.

ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు పోలింగ్‌ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఈసీ.. ఒక రౌండ్‌కు 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్లను లెక్కించనుంది. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువ 1,476 పోలింగ్‌ స్టేషన్లున్న ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ ఫలితం మొదట రానుంది. ఈవీఎంలలో పోలైన ఓట్ల తో వాటిని సరిపోల్చుకున్న అనంతరం విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా అత్యధిక ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు ఉన్న నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది.

- Advertisement -