ఖరీఫ్‌కు ఎరువులు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ హాకా భవన్‌లో ఖరీఫ్‌లో కావాల్సిన ఎరువులపై సమీక్ష నిర్వహించారు నిరంజన్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో కలుపుకుని 21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఖరీఫ్ కోసం కేటాయించిందన్నారు. 1.5 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే, 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎంఓపీ కేటాయించిందన్నారు.
ఏప్రిల్ లో తెలంగాణకు రావాల్సిన 1.06 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు 0.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చిందని..- రావాల్సిన మిగతా మొత్తాన్ని వెంటనే సరఫరా చేయాలన్నారు. ఎరువుల కంపెనీలు తమ తమ కోటా ఎరువులను వెంటనే సరఫరా చేయాలి..రాష్ట్రానికి వచ్చే రేక్ లకు అనుగుణంగా ఎరువుల సంస్థలతో మార్క్ ఫెడ్ కు ఉన్న ఒప్పందం మేరకు హ్యాండ్లింగ్ సంస్థలు స్థల లభ్యతను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కాకినాడ నౌకాశ్రయంలో ఉన్న 22 వేల మెట్రిక్ టన్నుల యూరియాలో ఏప్రిల్ నెల వాటాను ఇఫ్కో కంపెనీ వెంటనే తరలించాలని.. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ నెలలో కేటాయించిన 3 వేల మెట్రిక్ టన్నులకు గాను 11600 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం పట్ల అభినందనలు తెలిపారు.
రేక్ పాయింట్లలో ఎరువుల లోడింగ్, అన్ లోడింగ్ లో హమాలీల కొరత రాకుండా ఆయా జిల్లాలలో ఆశ్రయం పొందిన వలస కార్మికులతో పని జరిగేలా ఆయా జిల్లాల కలెక్టర్ల సహాయం తీసుకోవాలన్నారు. స్థలసమస్య వస్తే అవసరాన్ని బట్టి ఆయా జిల్లాలలో ఫంక్షన్ హాల్స్ ను తాత్కాలికంగా ఉపయోగించుకోవాలన్నారు. పీఎసీఎస్ లలో ఇప్పటికే గుర్తించిన స్థలాలకు ఎరువులు సరఫరా చేయాలని.. వ్యవసాయశాఖ, మార్క్ ఫెడ్ లు , ఎరువుల కంపెనీలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఖరీఫ్ అవసరాల నిమిత్తం మే నెలాఖరువరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా , లక్ష మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఎరువుల సరఫరా , ఇతర పనులలో నిమగ్నమైన కార్మికులు, డ్రైవర్లకు శానిలైజర్లు, మాస్క్ లోత పాటు గుర్తింపుకార్డులు, పాస్ లు ఉండేలా చూసుకోవాలన్నారు.
ప్రణాళిక పూర్థిస్థాయిలో అమలయ్యేలా వ్యవసాయ కమీషనర్ కార్యాలయం, అన్ని జిల్లాల డీఎఓలు, మార్క్ ఫెడ్ డీఎంలు సమన్వయంతో ఎరువుల కంపెనీలు, హ్యాండ్లింగ్ ఏజెంట్ల ద్వారా ఎరువుల సరఫరాను పర్యవేక్షించాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి , మార్క్ ఫెడ్, రైల్వే , అగ్రోస్ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హ్యాడ్లింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు.