బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 5న నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లును రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. సభా స్థలిలో నిర్వహకులతో మాట్లాడారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన నాందేడ్‌లో సభ జరుగుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సభకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున్న ప్రజలు పాల్గొంటారని ఈ మేరకు సభా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహించనున్న తొలి సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నామని తెలిపారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు అనూహ్య స్పందన వస్తుందని, నాందేడ్ జిల్లాలో అనేక గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే బాగుంటుందని ప్రజలు వ్యాఖ్యనిస్తున్నారని చెప్పారు. సభలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…