సాగునీటి కోసం రైతుల పోరుబాట

6
- Advertisement -

జూరాల కుడి కాలువకు తక్షణమే సాగునీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, అఖిలపక్ష నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నీటి కోసం రైతులు సోమవారం జోగులాంబ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు.

కలెక్టరేట్ వద్ద నిరసన అనంతరం రైతులు ర్యాలీగా జమ్మిచేడు వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కాలువకు నీళ్లు వదిలే వరకు వెనక్కి తగ్గేదే లేదని, ధర్నా విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్టు ఆనకట్టపై కూడా రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు.

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ ‘జూరాల ప్రాజెక్టు ముట్టడి’కి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. వనపర్తి, ఆత్మకూర్, అమరచింత, నర్వ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.

ఆందోళనకారులు ప్రాజెక్టు వైపు రాకుండా పోలీసులు జూరాల పరిసరాలను పూర్తిగా దిగ్బంధించారు. ఆనకట్ట వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, వెళ్లే రహదారుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గద్వాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి పిలుపునివ్వడంతో అక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న

- Advertisement -