రైతులు ఏం అడుగుతున్నారు…కేంద్రం ఏం చెబుతోంది!

165
farrmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న ఆందోళన 13వ రోజుకు చేరగా పలు దఫాలుగా రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇవాళ జరిగే దేశ వ్యాప్త బంద్‌కు 18 రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. అసలు రైతులు ఏం అడుగుతున్నారు…కేంద్రం ఏం చెబుతుందో చూద్దాం..

ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలన్నది ప్రధాన డిమాండ్.

కొత్త వ్యవసాయం చట్టంలో పొందుపర్చినట్లుగా సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే దేశం –ఒకే మార్కెట్‌ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అన్నదే లేకుండా పోతుందనేది రైతుల వాదన. మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది.నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం రైతులు డిమాండ్ చేసిన మేరకు సాగు చట్టాలకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం అని తెలిపింది. కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది. రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం అని తెలపడంతో పాటు రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపింది.

అయితే రైతులు వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు.ఎంఎస్‌పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్‌ తీర్చడం అసాధ్యమని కేంద్రం చెబుతుండటంతో ప్రధాన సమస్య నెలకొంది.

- Advertisement -