తెలంగాణ జిల్లా నుంచి మరో ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం కానున్నది. ఈ నెల 10వ తేదీన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదే రోజు ఉదయం 11.15 గంటలకు అన్ని జిల్లాల్లో కార్యక్రమం అధికారికంగా ప్రారంభం అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరగనుంది.
చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ కేంద్రాల వద్ద టెంట్లు వేయడంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలకు చేరిన పాసు పుస్తకాలు, చెక్కులను గ్రామాలకు పంపాలన్నారు. ఏ గ్రామంలో ఏ రోజు పంపిణీ ఉంటుందో స్థానికంగా తెలపాలని సూచించారు. పంపిణీ రోజుల్లో రెవెన్యూ, వ్యవసాయశాఖ మంత్రులు గ్రామాల్లో పర్యవేక్షించాలని సీఎం పేర్కొన్నారు. కాగా రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.