సోషల్ మీడియా అయిన ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేసే ఆకతాయిల ఆటకు ఇక పుల్ స్టాప్ పడనుంది. అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయకుండా..కట్టడి చేసేందుకు ఫేస్‌బుక్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. అత్యాధునిక ‘ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్’ను సాంకేతికతతో అభ్యంతరకరమైన లైవ్ స్ట్రీమింగ్‌లను గుర్తించి వినియోగదారులను అలర్ట్ చేయనుంది.
సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి చిల్లర చేష్టలకు పాల్పడే పోకిరీలు చాలా మందే ఉంటారు. ఫేస్‌బుక్ లైవ్‌లో అభ్యంతరకరమైన దృశ్యాలను.. హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తుంటారు. ఇప్పటి వరకు ఎవరైనా అసభ్యకరమైన వీడియోలను పోస్టు చేస్తుంటే వాటిపై వినియోగదారులు ఫిర్యాదు చేస్తేనే ఫేస్‌బుక్ చర్యలు తీసుకునేది.
ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఆ వీడియోలు నిజంగానే ఇబ్బందికరంగా ఉన్నాయా? లేవా అని పరిశీలించాల్సి ఉండేది. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఎవరైనా అభ్యంతరకరమైన వీడియోలను లైవ్‌లో ప్రసారం చేస్తే తక్షణమే గుర్తించే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఒకవేళ వీడియో అభ్యంతరకరమైనదిగా గుర్తిస్తే దానిపై అలర్ట్ గుర్తులను చూపిస్తుంది. అవసరమైతే బ్లాక్ చేసేస్తుంది.
నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ వార్తలను అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు అభ్యంతరకర వీడియోలను గుర్తించే ఈ సాంకేతికత వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగినట్లే.