మహాకూటమి పొత్తులో భాగంగా సనత్ నగర్ టికెట్ ను టీడీపీకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఈసందర్భంగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తనకు సనత్ నగర్ టికెట్ దక్కలేదని చెప్పారు.
తనకు సీటు రాకుండా కొందరు నేతలు ప్రయత్నాలు చేశారన్నారు. సనత్ నగర్ సీటును టీడీపీకి ఇవ్వమని ఎవరూ అడగలేదన్నారు. టీడీపీ వద్దని చెప్పినా కూడా బలవంతంగా సనత్‌నగర్ స్థానాన్ని ఆ పార్టీకే కేటాయించారని చెప్పారు. మర్రి శశిధర్‌రెడ్డి గెలువలేడు అని స్క్రీనింగ్ కమిటీ ముందు ఉత్తమ్ కుమార్‌రెడ్డి గట్టిగా చెప్పడం, ఉత్తమ్ చేయించిన సర్వేలో తాను గెలవలేను అని తేలిందనడం తనను బాధించాయన్నారు.
నామినేషన్ దాఖలుకు ఇంకా రెండు రోజులు సయయం ఉండటంతో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తానకు సికింద్రబాద్ నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. రాజకీయాల్లో తనకు సుదీర్ఘమైన అనుభవం ఉందని… పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.