హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా హయ్యర్ సెకండరీ పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. చౌతాలా వయస్సు.. 82 ఏళ్లు. టీచర్ల నియామక కుంభకోణంలో దోషిగా తేలిన చౌతాలా ప్రస్తుతం తీహార్ జైలులో పదేళ్ల శిక్షఅనుభవిస్తున్నారు.
అయితే ఆయనకు చదువు మీద మమకారం ఎక్కువ. అందుకే జైలులోనే 12వ తరగతి పరీక్షల కోసం శ్రమించారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై సంతోషిస్తున్నారు. తన విద్యాభ్యాసాన్ని ఇంకా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బీఏలో చేరాలనుకుంటున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తీహార్ జైలులో ఖైదీల కోసం నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో చౌతాలా ఉత్తీర్ణులయ్యారు. ఆయన కుమారుడు, ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ సింగ్ చౌతాలా ఈ వివరాలను తెలిపారు.
ప్రస్తుతం మనవడు దుష్యంత్ వివాహం కోసం పెరోల్‌పై ఉన్న ఆయన.. ఏప్రిల్ 23న జైల్లో నిర్వహించిన పరీక్షకు హాజరైనట్లు అభయ్ వెల్లడించారు.2000 సంవత్సరంలో 3,206 మంది ఉపాధ్యాయులను ఎంపికలో ఆయనపై అవినీతి అరోపణలు వచ్చాయి. దీంతో 2013లో ట్రైల్‌కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించగా సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది.
ఓం ప్రకాశ్ చౌతాలా బాల్యంలో కుటుంబ పరిస్థితులవల్ల చదవలేకపోయారు. ఆయన తండ్రి దేవీలాల్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఓం ప్రకాశ్ పెద్ద కుమారుడు కావడంతో వ్యవసాయం, కుటుంబ బాధ్యతలను స్వీకరించారు. పర్యవసానంగా చదువును అర్ధాంతరంగా ఆపేయవలసి వచ్చింది. తనకన్నా చిన్నవారైన సోదరులను, సోదరీమణులను చదివించారు. కొంత కాలం తర్వాత ఆయన స్వయంగా రాజకీయాల్లో ప్రవేశించారు.