మిడిల్‌క్లాస్‌కు చెందిన తాను మిడిల్‌క్లాస్ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఈ స్థాయికి వచ్చానన్నారు హీరో నాని. దిల్ రాజు తనకు ఎంసీఏ సినిమాలో హీరోగా అవకాశం కల్పించి ఒక రేంజ్‌కు తీసుకెళ్లారన్నారు. ఎన్ని జన్మలెత్తినా వరంగల్ రుణం తీర్చుకోలేము. ఒకే ఏడాది దిల్‌రాజుగారి సంస్థలో రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడి మధ్యతరగతి మనస్తత్వమంతా తెరపై కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేసే చిత్రమిది అన్నారు.
సాయిపల్లవి ఫిదాతో తెలంగాణ భానుమతి అయిపోయిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండో సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే చేసింది. ఎంసీఏలో అన్నా వదిన, మరిది మధ్య వుండే అనుబంధాన్ని చూపించాం. సకుటుంబంగా ఆనందించే చిత్రమవుతుంది. పతాకఘట్టాలు హృదయాన్ని స్పృశిస్తాయి. ఈ ఏడాది మా సంస్థలో వస్తున్న ఆరో చిత్రమిది. తెలుగు పరిశ్రమలో ఒకే సంవత్సరం ఆరు చిత్రాలు ఎవరూ చేయలేదు. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది అని దిల్‌రాజు చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ఎంసీఏ మిడిల్‌క్లాస్ అబ్బాయి అంటున్నారు. చిన్న సవరణ ఏంటంటే..ఎంసీఏ అంటే మిడిల్‌క్లాస్ మైండ్‌సెట్. మధ్యతరగతి జీవితాన్ని అందంగా ఆవిష్కరించే చిత్రమిది అన్నారు. వేణు కథ చెప్పగానే తనకు బాగా నచ్చిందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఎంసీఏ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం వరంగల్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా ట్రైలర్‌ను ప్రదర్శించారు. హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ శ్రీరాం వేణు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, సినిమా కొరియోగ్రాఫర్ సమీర్‌రెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, బాలాజీ, విలన్ విజయ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. యాంకర్ ఝాన్సీ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు.