“మొక్కలు నాటడం మానవుని నైతిన బాధ్యత”..

475
Pyeong
- Advertisement -

ప్రకృతి వినాశనానికి కారణమైన మానవుడు దాని దుష్పరిణామాలను చవిచూస్తున్నాడని కనుక ప్రకృతిని రక్షించడం కోసం ప్రతి మానవుడు తన నైతిక బాధ్యతగా మొక్కలు నాటాలని పద్మశ్రీ అవార్డు గ్రహిత, ఫారెస్ట్ మ్యాన్ గా పేరొందిన మొలాంగ్ పెయాంగ్ అన్నారు. సింగరేణి భవన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 24వ తేదీ) నాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి భవన్‌కు విచ్చేసిన ఆయనకు డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం, జి.ఎం. (సి.డి.ఎన్. & సి.పి.ఆర్.ఓ.) ఆంటోని రాజా, అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీ పెయాంగ్ తన స్వీయ అనుభవాలను పంచుకుంటూ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది తీరంలో దాదాపు 1,400 ఎకరాల బీడు భూములలో 30 సంవత్సరాలు కష్టపడి ఒక దట్టమైన అడవిని రూపొందించానని, దీనిలో అన్ని రకాల జంతుజీవాలు, పశుపక్షాదులు చేరడంతో ఆ ప్రాంతం దేశ వ్యాప్తంగా సంచలనం అయిందన్నారు. ఈ అటవీ ప్రాంతానికి తన పేరును కూడా జోడించారని వివరించారు. చెట్లను నరకడానికి కొందరు ప్రయత్నించగా తాను తీవ్రంగా ప్రతిఘటించానని, గొడ్డలి వేటు ముందుగా చెట్లపై కాదు నాపై వేయండని హెచ్చరించి చెట్లను రక్షించానని పేర్కొన్నారు.

Pyeong

తన తోటి మిత్రులు పెద్ద ఉద్యోగాల్లో, పట్టణాల్లో ఉన్నప్పటికి తాను మాత్రం కుటుంబంతో సహా అడవిలోనే ఉంటూ మొక్కలతో చెట్లలతో కలిసి జీవిస్తున్నానని, ఏడాది మొత్తం మొక్కలు, విత్తనాలు సేకరించి, నాటడమే వృత్తిగా పెట్టుకున్నానని పేర్కొన్నారు. తన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ వంటి అవార్డులు లభించాయని, అయితే మొక్కలు నాటడంలోనే గొప్ప సంతృప్తి పొందుతున్నానని పేర్కొన్నారు. మొక్కలు నాటడంపై ప్రచారం చేస్తూ దేశమంతా పర్యటిస్తున్నానని వివరించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని పెంచాలని మనుషులుగా పుట్టనందుకు ఇది ఒక నైతిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.

డైరెక్టర్ ఫైనాన్స్ఎన్.బలరాం కూడా సింగరేణి సంస్థలో స్వయంగా వేలాది మొక్కలు నాటుతూ స్ఫూర్తి నివ్వడంపై సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్.బలరాం, జి.ఎం. (సి.డి.ఎన్.) ఆంటోని రాజా సింగరేణిలో తీసుకుంటున్న పర్యావరణహిత చర్యలను వివరించారు. అనంతరం ఫారెస్ట్ మ్యాన్ మొలాంగ్ పెయాంగ్‌ను కంపెనీ తరపున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎ.జి.ఎం. మార్కెటింగ్ ఎన్.వి.కె. శ్రీనివాస్ రావు, డి.జి.ఎం. లు రాజేశ్వర్ రావు, టి. శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర్ రావు, ఎ.డి.ఎం. బి.భాస్కర్, ఎస్.ఈ. యూ సంజీవ రెడ్డి, డిప్యూటీ మేనేజర్ డుండే వెంకటేశం, పి.ఆర్.ఓ. బి.మహేష్, ప్రజాకవి జయరాజు, ఇగ్నైటింగ్ మైండ్స్ సి.ఇ.ఓ. కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ కమ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారి ఈ కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యవహరించారు.

- Advertisement -