బీజేపీలో ఈటల ఇమేజ్ మరింత డ్యామేజ్‌..!

136
- Advertisement -

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఆయన సొంత వర్గీయులే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన క్రమంలో ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ వంటి ఉద్యమ నేతలతో పాటు, హుజురాబాద్ నియోజకవర్గంలోని ఈటల ముఖ్య అనుచరులైన పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కాషాయ కండువాలు కప్పుకున్నారు. అయితే ఈటల ఎంట్రీతో బీజేపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఈటల పట్టుదలగా ఉన్నారు. అసలు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది తన స్థాయి కాదన్నట్లుగా వ్యవహరించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్‌ ఇష్టానుసారంగా వ్యవహరించారు. జిల్లాలలో పర్యటిస్తూ స్థానిక నేతలతో మీటింగ్‌లు నిర్వహిస్తూ తన సొంత సామాజికవర్గం వారితో సన్మానాలు చేయించుకుంటూ బీజేపీలో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఓ దశలో బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయా..ఈటల రాజేందరా అన్న అనుమానాలు కాషాయ కార్యకర్తల్లోనే నెలకొంది.

ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై మండిపడిన బండి సంజయ్‌ పైకి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నారు. అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికలలో తమకు తగినంత బలం లేకపోవడంతో పోటీ చేయడం లేదన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలను ధిక్కరించి తన మాజీ అనుచరుడు, కరీంనగర్ మాజీ మేయర్‌ సర్దార్ రవీందర్ సింగ్‌ను కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాడు. బీజేపీ కార్పొరేటర్లను, స్థానిక ప్రజా ప్రతినిధులను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే సర్దార్ ఓడిపోవడంతో ఈటల రాజేందర్‌కు బీజేపీలో బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. సర్దార్‌ను బీజేపీలోకి తీసుకోవాలని ప్రయత్నించిన ఈటల ప్రయత్నాలకు బండి సంజయ్ బ్రేక్ వేశాడు. హైకమాండ్ కూడా ఈటల రిక్వెస్ట్‌ను లైట్ తీసుకుంది. ఈక్రమంలో సర్దార్ రవీందర్‌ సింగ్‌ను సీఎం కేసీఆర్ క్షమించడంతో ఆయన తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. కేసీఆర్‌తోనే నా ప్రయాణం అని ప్రకటించిన ఉద్యమనేత సర్దార్ హుజురాబాద్‌లో ఈటల అనుచరులను తిరిగి సొంతగూటికి రప్పించే ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది.

కాగా సర్దార్ ఎపిసోడ్‌లో బీజేపీలో ఈటల ఇమేజ్ ఘోరంగా డ్యామేజీ అయింది. మరోవైపు ఈటల వెన్నుపోటు రాజకీయం గ్రహించిన బండి సంజయ్ దూకుడు పెంచారు. వరుసగా ధాన్యం కొనుగోలు అంశంపై, 317 జీవోపై దీక్షలు చేసి హల్‌చల్ చేశాడు. సీఎం కేసీఆర్ కూడా బండి సంజయ్‌ను టార్గెట్ చేయడంతో ఈటల మెల్లగా సైడ్ అయిపోయారు. ప్రస్తుతం కాషాయ పార్టీలో ఈటల రాజేందర్‌కు గతంలో ఉన్న ప్రాధాన్యత తగ్గింది. ఇక ఈటలతో బీజేపీలో చేరిన ముఖ్య అనుచరులు కూడా ఉప ఎన్నికల టైమ్‌లోనే తిరిగి టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈటల వర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమలు తప్పా పెద్దగా చెప్పుకోదగ్గ నేతలు లేరు. ఈటల టీఆర్‌ఎస్‌ను వీడినప్పుడు ఉద్యమనేతలందరిని బీజేపీలోకి తీసుకువస్తానని హైకమాండ్ దగ్గర బిల్డప్పు ఇచ్చారంట..కాని ఈటలను నమ్మి ఉద్యమనేతలెవ్వరూ బీజేపీలో చేరడం లేదు. దీంతో హైకమాండ్‌ కూడా ఈటల రాజేందర్ కేసీఆర్ రేంజ్ నాయకుడు కాదని గ్రహించి మెల్లగా ప్రియారిటీ ఇవ్వడం తగ్గించిందంట..ప్రస్తుతం బీజేపీలో ఈటల వెంట చేరిన నాయకుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.

ఎల్లారెడ్డిపేట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కాని స్థానికంగా బీజేపీ నేతలు ఏనుగు రవీందర్‌కు టికెట్ ఇవ్వకుండా బండి సంజయ్‌ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారంట…ఇక ఈటల వెంట బీజేపీలో చేరిన తుల ఉమ పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తన సొంత గడ్డ వేములవాడలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని తుల ఉమ భావించారంట…కాని వేములవాడ సీటుపై బండి సంజయ్ కర్చీఫ్ వేయడంతో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. మరోవైపు పార్టీలో ఈటల రాజేందర్‌కు మొదట్లో ఉన్న ప్రాధాన్యత లేకపోవడంతో పాటు, తమ రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారడంతో ఏనుగు రవీందర్, తుల ఉమలు పునరాలోచనలో పడ్డారని సమాచారం.

ఈ నేపథ్యంలో సర్దార్ రవీందర్ సింగ్ రంగంలోకి దిగి ఏనుగు రవీందర్‌, తుల ఉమలను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు ప్రయత్నాలు షురూ చేశారంట..ప్రస్తుతం ఏనుగు రవీందర్ తిరిగి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం తాను బీజేపీ వీడేది లేదని, ఇదంతా టీఆర్ఎస్ మైండ్ గేమ్ అని అంటున్నారు..కాని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి త్వరలోనే ఏనుగు, తుల ఉమలు కారెక్కడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇమేజ్ మరింత డ్యామేజీ అవుతుందనడంలో సందేహం లేదు.

- Advertisement -