తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 వేల మందికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఇక గత 24 గంటల్లో 237 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 4974 కేసులు నమోదయ్యాయి.
ఆదివారం నమోదైన పాజిటివ్ కేసుల్లో 23 మంది జర్నలిస్టులు ఉన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి కరోనా సోకింది. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న 140 మంది జర్నలిస్టులు విడుతలవారీగా కరోనా పరీక్షలు చేయించుకోగా, వారిలో 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ శనివారం డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభించేందుకు వచ్చిన బాజిరెడ్డి కార్యక్రమం ముగిసిన తర్వాత నిజామాబాద్‌కు వెళ్లారు. సాయంత్రం దవాఖానకు వెళ్లి నమూనాలు ఇచ్చారు. ఆదివారం ఉదయం పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం స్వయంగా వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లారు.
ఇక ఏపీలో కరోనాతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్ సురేశ్ మృతి చెందారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్‌లోనూ కరోనా టెస్టులకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఇక ఇప్పటికే మంత్రి హరీశ్ రావు పీఏ,ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్‌మెన్,మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రాగా వారంతా హోమ్ క్వారైంటన్‌కు వెళ్లారు.