రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజల ఆశీర్వాద సభలు’..

231

సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్త దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. 50 రోజుల్లో వంద సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నారు. ఇందుకు ముహూ ర్తం ఖరారయ్యింది. శ్రావణమాసం అన్ని మంచి పనులకు శ్రేష్ఠం. వేదపండితులు కూడా ఇదే విషయాన్ని చెప్తుంటారు. దీంతో ఈ శుక్రవారం ప్రజా ఆశీర్వాద సభ పేరిట హుస్నాబాద్ నుంచి సభలను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

CM KCR

ఈ సభల నిర్వహణ భాదత్యలను ఆర్థిక మంత్రులు ఈటల రాజేందర్‌, హరీష్‌ రావులు పర్యవేక్షించనున్నారు. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తొలి సభను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి ఈటెల తెలిపారు. మంగళవారం హుస్నాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సీఎం సభాస్థలిని ఖరారు చేశారు. వీరితోపాటుగా ఎంపీ వినోద్‌కుమార్‌, శాసనసభ్యుడు వొడితల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి పాల్లోన్నారు.

Ministers Harish Rao

అనంతరం మంత్రి ఈటెల మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఏ గొప్ప కార్యక్రమమైనా కరీంనగర్‌ జిల్లా నుంచే మొదలుపెట్టి విజయం సాధిస్తారని గుర్తుచేశారు. అందుకే మరోసారి ప్రజల మద్దతు కోరుతూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌లో తొలి సభను ఏర్పాటు చేస్తున్నారన్నారు. 50 రోజుల్లో..100 నియోజకవర్గాల్లో..100 సభలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు. రోజుకు రెండు సభల్లో కేసీఆర్‌ ప్రసంగిస్తారన్నారు. ‘ప్రజల ఆశీర్వాద సభలు’గా వీటికి నామకరణం చేసినట్టు చెప్పారు. తొలి సభను సమన్వయం చేయడానికి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఏడుగురు ఇన్‌ఛార్జులను నియమించినట్టు తెలిపారు.