కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలి- ఈటెల

264
Minister Etela Rajender
- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. హోమ్ క్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుండి బయటకి రానివ్వడం లేదు. చిన్న ఇల్లు ఉన్న వారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేని వారు హాస్పిటల్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. మరోపక్క పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు వైరస్ సోకుతుందేమో అని భయం ప్రజల్లో ఉండడం వల్ల చాలామంది హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారు.

జియగూడలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. శివ చరణ్ అనే వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకడంతో ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కానీ కాలనీలో పక్కన వారు ఇబ్బంది పెట్టడంతో తప్పని సరి పరిస్థితుల్లో హాస్పిటల్‌కి రావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల వల్ల హాస్పిటల్స్ మీద భారం పెరుగుతుంది. రోజు రోజుకి హాస్పిటల్స్‌లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

జీవనోపాది కోల్పోకూడదు అని మాత్రమే లాక్ డౌన్‌ను ఎత్తి వేయడం జరిగింది తప్ప ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకి రావడంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. వయసు మీదపడిన వారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కరోనా సోకకుండా ఉండే జాగ్రత్తలు పాటించాలని మరోసారి కోరారు. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నామని భూమి మీద ఏ మందు ఉన్న తెచ్చి చికిత్స అందిస్తామని అన్నారు. అయితే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ హైదరాబాద్ తీసుకువచ్చి చికిత్స అందించడం సాధ్యం కాదు కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి,చికిత్స చేయాలని ఈరోజు సచివాలయంలో ఉన్నత అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోనే ఐసోలేషన్‌లో ఉంచేలాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -