అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రోను ప్రారంభించిన గవర్నర్..

224
Ameerpet-LB Nagar Metro
- Advertisement -

భాగ్యనగరానికే తలమానికమైన హైదరాబాద్‌ మెట్రో రైలు కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) మార్గం సోమవారం ప్రారంభమైంది. అమీర్‌పేట – ఎల్బీనగర్ మెట్రో రైలును గవర్నర్ నరసింహన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు గవర్నర్ నరసింహన్‌తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ప్రయాణించారు.

ESL Narasimhan

కొత్త కారిడార్ ద్వారా 16 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గం వాడకంలోకి రానుంది. అమీర్‌పేట-ఎల్బీనగర్ మధ్య ఉన్న 16 కిలోమీటర్ల కొత్త కారిడార్‌లో 17 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మార్గంలో ప్రయాణికులను అనుమతించనున్నారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 Ameerpet-LB Nagar Metro

ఇది దేశంలోనే రెండో పొడవైన మెట్రో కావడం గొప్ప విషయం. దేశంలో ఢిల్లీలో మాత్రమే 252 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందిస్తుండగా, తర్వాత స్థానంలో చెన్నై 35.3 కి.మీ. దూరం సేవలందిస్తున్నది. తాజాగా చెన్నైని హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) వెనుకకు నెట్టివేసి రెండో స్థానానికి చేరుకుంది. ఇప్పటికే ప్రారంభమైన మెట్రో మార్గం కంటే ఈ మార్గానికి ఎక్కువ ఆదరణ వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అతి త్వరలోనే మూడో కారిడార్‌లో మిగిలిన 8.5 కిలోమీటర్ల మేర గల అమీర్‌పేట- శిల్పారామం మార్గాన్ని సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -