BRS అధినేత, మాజీ CM KCR దత్తత గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాల్లో గ్రామ పంచాయతి సర్పంచ్ లు ఏకగ్రీవం అయిన నేపథ్యంలో నూతనంగా ఎన్నికయిన రెండు గ్రామాల సర్పంచ్ లు, వార్డు సభ్యులు ఎర్రవల్లి లోని నివాసంలో మాజీ CM KCR ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.. నూతనంగా ఎన్నికయిన సర్పంచ్ లకు KCR శాలువా కప్పి అభినందించారు..
గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో, నూతన తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని,.దళిత గిరిజన బహుజన మహిళా వర్గాలకు కుల వృత్తులకు, నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం., తెలంగాణ పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని , తాను దార్శనికత తో తాను సీఎం గా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని,తెలంగాణ తొలి ముఖ్య మంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి గా తాను దత్తత తీసుకున్న , తన గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని, ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు.. వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి, గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించిన కేసీఆర్ వారికి మిఠాయిలు పంచారు. సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను, గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరునా అడిగి కేసీఆర్ గారు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా… తెలంగాణ లో గత బి ఆర్ ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్థులు కేసీఆర్ గారి దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విద్యుత్ సాగునీరు సహా వ్యవసాయాభివృద్ధికి కేసీఆర్ సీఎం గా అందించిన సహకారం, పల్లె ప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులు, గొల్ల కురుమ, ముదిరాజ్ బెస్త, గౌడ, పద్మశాలి సహా చాకలి మంగలి సబ్బండ కుల వృత్తులకు, దళిత బహుజన గిరిజన మహిళల కోసం ప్రత్యేకంగా అమలుచేసిన పథకాలు, అందించిన ఆర్థికసాయం… గురించి చర్చిస్తూ స్మరించుకున్నారు.
క్రమం తప్పకుండా ఆసరా సహా సకల రకాల పింఛన్లు అందిన ఆర్ధిక సహకారంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పగా ఫరిడ విల్లిందో…. చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సమావేశంలో ఉన్న ఒక గ్రామస్థుడు మాట్లాడుతూ… “సార్ తమరి హయాం మా పల్లెలకు సువర్ణ యుగం… ఇప్పుడేముంది సార్…గోస మిగిలింది. అన్ని కులాలు అరిగోస పడుతున్నయి. ఏదైనా…పోగొట్టుకున్నంకనే అర్థమైతది.. సార్. మీరు వున్నప్పుడు తెల్వలె మీ విలువ.. ఇప్పుడు అర్థమైతాంది. మల్ల మీరొస్తే తప్ప తెలంగాణ పల్లెలకు మునుపటి కళ రాదు..మల్ల మీరే రావాలే… వస్తరు.. కాంగ్రెస్ ప్రభుత్వం ల ఇగ మాగ్గూడ రోండెండ్లకే సరిపోయింది సార్…” అని అన్నారు. కాగా ఆయన వివరించినప్పుడు బాధతో పాటు నవ్వులు విరిసాయి.
అందుకు సమాధానంగా మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…” మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్ని కొన్ని సమయాలు కష్టాలు వస్తయి., వాటికి వెరవకూడదు. మల్లా మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి., అప్పడిదాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు., గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలె ” …అని కేసీఆర్ గారు గ్రామస్థులకు వివరించారు.
” ఇప్పుడు నూతనంగా ఎన్నికైతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు..” అని కేసీఆర్ తెలిపారు .ఈ సందర్భంగా వారికి జాతీయ అంతర్జాతీయంగా పల్లెల ప్రగతికోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కేసీఆర్ గారు వివరించారు.బంగ్లాదేశ్ కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటు కు స్ఫూర్తిదాత, ప్రొఫెసర్ యూనిస్ తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు.
వారిని ఆదర్శంగా తీసుకుని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలి.. అని కేసీఆర్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా… నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డు మెంబర్లు., నర్సన్న పేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు సమావేశంలో హాజరయ్యారు. వారిని కేసీఆర్ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పార్టీ నేత మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులున్నారు.

