కరోనా కష్ట కాలంలోనూ సీఎం కెసిఆర్ రైతు బంధు నిధులు రూ.7వేల కోట్లు, 25వేల లోపు రుణాల ఏకమొత్తం మాఫీ కోసం రూ.1200 కోట్లు, ఉపాధి హామీ కింద కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ.170 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ఉన్న ప్రజల పట్ల నిబద్ధతను, నిజాయితీని ప్రజలకు వివరించే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పర్వతగిరి నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు ఈ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేస్తూ లాక్ డౌన్ ముందుగా ప్రకటించడమేగాకుండా, రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న ఘనత కూడా మన సీఎం కెసిఆర్ దే అన్నారు. అలాగే ఉపాధి హామీకి, రైతు బంధుకి, రైతుల రుణమాఫీకి నిధులు మంజూరు చేసి, తన నిజాయితీని, నిబద్ధతని చాటుకున్నారని అన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల ప్రత్యేక శ్రద్ధ వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని, వారి ముందు చూపు, పరిపాలనా దక్షతకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని, ప్రజలకు ప్రభుత్వ చర్యలపై అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులకు సూచించారు.