డెస్క్, ఫోటో, వీడియో జర్నలిస్టులనే తేడాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జర్నలిస్టులకు మొదటిసారి ప్రత్యేక నిధిని పెట్టి, ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా ఒక్క కెసిఆర్ దేనని ఆయన అన్నారు. ఈ మధ్యే బ్రెయిన్ స్ట్రోక్ తో హఠాన్మరణం పొందిన ఈనాడు పత్రిక సీనియర్ ఫోటో జర్నలిస్టు రాజమౌళి కుటుంబాన్ని హైదరాబాద్ మల్కాజీగిరి లోని వారి నివాసానికి వెళ్ళి మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి రాజమౌళి కుటుంబంతో కాసేపు మాట్లాడారు. వారి స్థితిగతులను తెలుసుకున్నారు. మరణానికి దారి తీసిన పరిస్థితులను అడిగారు. రాజమౌళితో తనకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకున్నారు. రాజమౌళి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.రాజమౌళి నిరాడంబర జీవి అని, తనకు చాలా కాలంగా రాజమౌళి తెలుసన్నారు. రాజమౌళి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు.
సిఎం కెసిఆర్ జర్నలిస్టుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించారని, ప్రెస్ అకాడమీ పేరున ఆ నిధిని ఉంచారన్నారు. మరణించిన కుటుంబాలను, వారి పిల్లలను ఆదుకోవడానికి, చదువుల కోసం ఆ నిధిని ఖర్చు చేస్తున్నారన్నారు. జర్నలిస్టులందరినీ సమంగా చూస్తున్న ప్రభుత్వం కూడా ఇదేనన్నారు.