రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ధర్మారం గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి…పారిశుద్ధ్య నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కమిషనర్ తో మాట్లాడిన ఎర్రబెల్లి..పారిశుద్ధ్యం నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు దయాకర్ రావు. రైతులతో మాట్లాడిన మంత్రి…ఈ నెల 8వ తేదీలోగా ధాన్యం కొనుగోలు అయిపోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, ధాన్యం కొనుగోలు నిర్ణీత గడువులో ముగిసే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
మురికి కాలువల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సిబ్బందిని ఆదేశించారు. కాలువలు శుభ్రంగా లేకపోతే, దోమలు, దుర్గంధం పెరిగి, అంటు వ్యాధులు ప్రభలుతాయని చెప్పారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలని…గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అనంతరం అర్ టీ సీ బస్సును తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి….ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. మాస్కులు లేని ప్రయాణికులను బస్సుల్లో అనుమతించవద్దన్నారు.