పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనుల ప్రగతి, రైతు వేదికలు, రైతుల కల్లాలు, పిఎంజిఎస్ వై రోడ్ల ఆన్ గోయింగ్ పనులను సమీక్షించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పిఎంజిఎస్ వై -ఫేజ్ 3, బ్యాచ్ -1 పనులను వెంటనే గ్రౌండ్ చేయాలని.. బ్యాచ్ -2 పనులకు ప్రతిపాదనలు కేంద్రానికి త్వరితగతిన పంపించాలన్నారు. తద్వారా మరిన్ని రోడ్లను మన రాష్ట్రానికి తెచ్చుకోవాలి. రోడ్లు లేని మరిన్ని గ్రామాలకు రోడ్లు వేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. ఉన్న రోడ్లను మరింతగా బాగు చేసుకోవాలి. ఇక రైతు వేదికలు వేగంగా పూర్తి కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత కాలానికి ఆయ పనులను పూర్తి చేయాలి. రైతుల పంటలు చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. వర్షాలు కూడా తగ్గాయి. కాబట్టి, రైతు కల్లాల పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంగళవారం తన నివాసంలో మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పిఆర్ ఇఎన్ సి సత్యానారాయణ రెడ్డి, పిఎంజిఎస్ వై సిఇ సంజీవరావు, ఎన్ ఆర్ ఈజీ ఎస్ సిఇ హన్మంతరావు, తదితర అధికారులతో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనుల ప్రగతి, రైతు వేదికలు, రైతుల కల్లాలు, పిఎంజిఎస్ వై రోడ్ల ఆన్ గోయింగ్ పనులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పిఎంజిఎస్ వై ఫేజ్-3 కింద రాష్ట్రానికి రూ.658 కోట్ల అంచనా వ్యయంతో, 2,427.5 కి.మీ రోడ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాటిలో బ్యాచ్ -1 కింద 1,119.94 కి.మీ.కు 152 పనులు మంజూరు అయ్యాయి. ఈ పనుల టెండర్లు ముగిశాయి. త్వరిగతిన ఈ పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక బ్యాచ్ -2 కింద మిగిలిన 1,308 కి.మీ. రోడ్లకు ప్రతిపాదనలను, పిఎంజిఎస్ వై నిబంధనల ప్రకారం పూర్తి చేసి, వెంటనే కేంద్రానికి పంపి, వాటి క్లియరెన్స్ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ పనులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత కాల వ్యవధిలో, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 2,601 రైతు వేదికల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతు వేదికలు ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యాయని, మిగతా సగం పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లెంటల్, రూఫ్ లేవల్ లో పూర్తయిన పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. మిగతా పనులకు నిర్ణీత గడవు నిర్ణయించుకుని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా పనులలో వెనుకబడిన జిల్లాల్లోనూ పనులు వేగంం చేయాలన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కల్లాలను నిర్మించాలని నిర్ణయించామని, వాటిని గ్రౌండ్ చేయాలన్నారు. వర్షాకాల పంటలు చేతికొచ్చే సమయం వచ్చినందున, రైతులతో మాట్లాడి కల్లాలను వెంటనే చేపట్టి, పూర్తి చేయాలని మంత్రి సూచించారు. త్వరిత గతిన పనులు పూర్తి కావాలి. అభివృద్ధి పనుల్లో ఆలస్యం తగదు. ఆయా పనులు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి పర్యవేక్షించాలి. కరోనా నేపథ్యంలో కుంటుపడిన పనులన్నీ… రెట్టించిన వేగంతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశారు.