సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రెండో విడత పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎలారెడ్డి నియోజకవర్గం తాడ్వాయిలో జరిగిన గ్రామసభకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ర్పంచ్ బండారి సంజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జాజల సురేందర్, జెడ్పి చైర్ పర్సన్ దఫెదర్ శోభ, ఎంపీపీలు, జెడ్పిటిసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. మొక్కలను నాటారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…నా 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను చూశాను. ఎవరూ చెయ్యని పనులను కేసీఆర్ చేశారన్నారు. 24 గంటల కరెంటు దేశంలోనే ఎక్కడా లేదన్నారు. అందరం కలిసి గ్రామాలను అభివృద్ధి చేరుకోవాలి. గ్రామాల నుంచి వెళ్లి బయట స్థిరపడిన వారి నుంచి విరాళాలు సేకరీంచాలని అధికారులకు సూచించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో స్కూళ్లను అభివృద్ధి చేసుకోవాలి. దాతల వివరాలను గ్రామపంచాయతీల వద్ద ప్లెక్సీలలో పెట్టాలన్నారు. ‘ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో ఎల్లారెడ్డి ప్రాంతానికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామని చెప్పారు.