మహబూబాబాద్ జిల్లా పరిధి, పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండల కేంద్రంలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్వర్యంలో ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామంలో కల్లాన్ని పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి, ధాన్యాన్ని పరిశీలించి, కల్లాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తున్నది. రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కెసిఆర్ పరిపాలన సాగిస్తున్నారు. అందుకు అనుగుణంగా అనేక పథకాలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనన్ని రైతు పథకాలు మన రాష్ట్రం లోనే అమలు అవుతున్నాయి. సాగు నీరు, 24 గంటలు నాణ్యమైన కరెంటు, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, పంటల కొనుగోలు వంటి అన్ని రైతు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇంత నిబద్ధతతో పని చేసిన, చేస్తున్న సీఎంలు దేశంలో లేరు అని మంత్రి అన్నారు.
ఇక్కడ సీఎం ధాన్యం కొంటుంటే అక్కడ కేంద్రం అడ్డుకాలు వేస్తున్నది. మద్దతు ధర సహా, ధాన్యం ఎక్కువ కొనవద్దని అంటున్నది. ఇక్కడ కొందరు, మద్దతు ధర పెంచాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ధాన్యం కొంటున్నయా రైతులు అవగాహన చేసుకోవాలి. చెప్పుడు మాటలు వినొద్దు, రైతులు చెడి పోవద్దు. ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రభుత్వ కార్యాచరణ ను అర్థం చేయాలి. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాలు సాగు జరిగింది. గతంతో పోలిస్తే, మూడు రెట్లు అధికంగా సాగు జరిగింది. ఆ మేరకు, పంటల దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు.
అంత పెద్ద మొత్తం దిగుబడులను ఈ కరోనా సమయంలో కొనాలని నిర్ణయించడం సాహసోపేతమే. అలాంటి సీఎం మనకుండటం మన అదృష్టం. ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా మార్కెట్లకు తేవాలి. ఇచ్చిన టోకెన్లు, నిర్ణీత తేదీల్లో మాత్రమే తేవాలి. మార్కెట్లకు వచ్చి రైతులు ఆగం కావద్దు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనుగోలు కేంద్రాలు నడిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.