లక్ష్మీపార్వతి వల్లే మంత్రిపదవి రాలేదు:ఎర్రబెల్లి

239
- Advertisement -

10 మందితో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో 6 మంది కొత్తవారికి స్ధానం దక్కగా వారిలో సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఒకరు. మంత్రిపదవి దక్కడంపై భావోద్వేగానికి గురయ్యారు ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

గతంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని అన్నారని కానీ అప్పుడు లక్ష్మీపార్వతి అడ్డుకుందని చెప్పారు. తర్వాత చంద్రబాబు మంత్రిపదవి ఇస్తానని చెప్పిన మాట తప్పారని కానీ కేసీఆర్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలందరిని కలుపుకొని పనిచేస్తానని తెలిపారు ఎర్రబెల్లి.

kcr errabelli

వరంగల్ జిల్లా పర్వతగిరిలో జగన్నాథరావు, ఆదిలక్ష్మి దంపతులకు 1956 జులై 4న జన్మించారు. ఇంటర్‌ వరకు చదువుకున్న ఎర్రబెల్లి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఆసక్తికనబర్చారు. రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రబెల్లి 1982లో టీడీపీలో చేరారు. సొసైటీ ఛైర్మన్‌గా,డీసీసీబీ చైర్మన్‌గా,ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్‌గా,ఎంపీగా అంచెలంచెలుగా ఎదిగారు. 1983లో తొలిసారి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు.

తర్వాత 1994లో వర్దన్నపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. 2008 జూన్‌లో వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

- Advertisement -