తమిళనాడు సీఎంగా పళనిస్వామి..

227
End to TN crisis
- Advertisement -

గత పది రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది.  అన్నాడీఎంకే పార్టీ శశికళ , పన్నీర్‌ సెల్వం వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.  అనిశ్చితికి తెరదించుతు గవర్నర్ విద్యాసాగర్ రావు పళని స్వామి వైపే మొగ్గుచూపారు.  ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా చూస్తే పళనిస్వామికే ఎక్కువమంది మద్దతు తెలపడంతో   గవర్నర్‌ ఆయన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బల నిరూపణకు 15 రోజుల గడువునిచ్చారు.

సాయంత్రం 4 గంటలకు పళనిస్వామి తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాంతో శశికళ వర్గం అధికారాన్ని చేజిక్కించుకున్నట్లయింది. కాసేపటి క్రితం గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. 124 మంది శాసనసభ్యుల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగాన్ని అను సరించి వ్యవహరిస్తానని పళనిస్వామికి గవర్నర్ స్పష్టం చేశారు. దాదాపు 20 నిమిషాల‌పాటు వీరి మధ్య చ‌ర్చ జ‌రిగింది. గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించిన వారిలో ప‌ళ‌నిస్వామితో పాటు సెంగొట్టియ‌న్‌, వేలుమ‌ణి, దిన‌క‌ర‌న్‌, జ‌య‌కుమార్‌, తంగ‌మ‌ణి ఉన్నారు.

అన్నాడీఎంకేలోని సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన పళనిస్వామి సేలం జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1954 మార్చిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి.. 80లలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందునుంచి ఆయన అన్నాడీఎంకేలోనే ఉన్నారు. తొలుత జయలలితకు, ఆమె మరణం తర్వాత శశికళకు ఆయన విధేయుడిగా వ్యవహరించారు. సేలం డెయిరీ చైర్మన్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అవుతున్నారు.

- Advertisement -