ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోషన్ కేసుల్లో మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నటుడు సోనూ సూద్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. 39 ఏళ్ల ఉత్తప్పను పీఎంఎల్‌ఏ (Prevention of Money Laundering Act) చట్టం కింద తన వాంగ్మూలం రికార్డ్ చేయించుకోవాలని ED ఆదేశించింది. ఢిల్లీలో ఈ కేసులో సమన్లు అందుకున్న మూడవ మాజీ భారత క్రికెటర్‌గా ఉత్తప్ప నిలిచాడు. ఇంతకుముందు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లను ED విచారించింది.
ఇటీవల, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి మిమి చక్రబర్తి వాంగ్మూలాన్ని ED రికార్డ్ చేసింది. మంగళవారం బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా కూడా హాజరయ్యారు. అదే రోజు సమన్లు అందుకున్న నటి ఉర్వశి రౌటేలా (భారతీయ బ్రాండ్ అంబాసడర్, 1xBet) ఇంకా హాజరుకాలేదు. గత ఆగస్టులోనే నటులు రానా దగ్గుబాటి, ఉర్వశి రౌటేలా సమన్లు అందుకున్నారు. 1xBetకు ఉర్వశి రౌటేలా భారతీయ బ్రాండ్ అంబాసడర్.
ఈ కేసు కింద విచారణలో ఉన్న 1xBet అనే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ అక్రమ కార్యకలాపాలు, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, అల్గారిథంల మోసం వంటి ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ అక్రమ యాప్‌లు కోట్లాది రూపాయలు మోసం చేసినట్టు, పన్ను ఎగవేశాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ యాప్‌లను ప్రచారం చేసిన సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఆర్థిక లావాదేవీలు, ఆ యాప్‌ల పనితీరు గురించి ఏ మేరకు తెలుసు అన్న దానిపై ED స్పష్టత తెచ్చుకోవాలని చూస్తోంది.
తెలంగాణ పోలీసులు కూడా ఈ ఏడాది ప్రారంభంలో 25 మంది సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా అక్రమ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 22 కోట్ల భారతీయులు వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారని, వీరిలో సగం (11 కోట్ల మంది) నిరంతర వినియోగదారులని అంచనాలు చెబుతున్నాయి.
Also Read:అమెరికాలో మళ్లీ టిక్‌టాక్..!

