బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో నిందితురాలు జాక్వెలిన్‌కు చెందిన రూ 7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఆమె పేరుతో ఉన్న రూ 7.12 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సహా పలు ఆస్తులున్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్నాడు. మోసగించిన సొమ్ములో సుఖేష్ జాక్వెలిన్‌కు రూ 5.71 కోట్ల వరకూ బహుమతులుగా ఇచ్చాడని ఈడీ అంచనా వేసింది. సుఖేష్ బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్, నోరాకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని ఆకట్టుకున్నాడని ప్రచారం సాగింది.
సుఖేష్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులను అందుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఖరీదైన వజ్రాల చెవిపోగులు, బ్రాస్ లెట్లు, మినీ కూపర్, డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్ లు తదితర కానుకలను జాక్వెలిన్, ఆమె కుటుంబ సభ్యులకు చంద్రశేఖర్ ఇచ్చినట్టు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. సుఖేష్‌తో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అధికారులు తేల్చారు. గతంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం వార్త బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.