కాంగ్రెస్ యువనేత రాహుల్ కు ఈసీ షాకిచ్చింది. రాహుల్ ఇంటర్వ్యూ ప్రసారాలపై చర్య తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి.. వెంటనే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ప్రసారాలను నిలిపి వేయించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీతో పలు టీవీ ఛానెళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించాయి. బుధవారం సాయంత్రం వీటిని టెలికాస్ట్ చేయడం ప్రారంభించాయి. గుజరాత్ రాజకీయాలే ప్రధానంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. దీంతో కొంత మంది బీజెపీ నేతలు ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళారు.
సదరు ఇంటర్వ్యూ అంశాన్ని పరిశీలించిన ఈసీ అది కచ్చితంగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంది. తక్షణం ఆ ఇంటర్వ్యూ ప్రసారాలను నిలిపేసి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయా టీవీ ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. కాగా..గుజరాత్‌లో నేడు (డిసెంబర్ 14)న అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది.
మంగళవారంతోనే ప్రచార గడువు ముగియడంతో 48 గంటల పాటు ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.