రేపే కౌంటింగ్….అన్నీ ఏర్పాట్లు పూర్తి

305
COunting
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గతనెల 11న ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించినప్పటికీ.. ఫలితాల కోసం ఓటర్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు.

ఓట్ల లెక్కింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో బుధవారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమ ల్లోకి రానుంది. 23న ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాల్లో ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుండటంతో మధ్యాహ్నం వరకూ 15 రౌండ్లు పూర్తి కానున్నాయి.

లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, మద్యం వంటివాటిని తీసుకురావద్దని అధికారులు సూచించారు. ఈసీ అనుమతి ఉన్నవారిని మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు అధికారులు. విజయోత్సవ ర్యాలీలు తీసుకునే వారు ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.

- Advertisement -