ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా?

5
- Advertisement -

ఈ రోజుల్లో చాలా మందికి ఇయర్‌ఫోన్స్ సంగీతం కోసం కాకుండా రోజువారీ జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరంగా మారాయి. ఆఫీస్ శబ్దాలు, ట్రాఫిక్ గోల, చుట్టూ ఉన్న గందరగోళాన్ని అడ్డుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ప్లే నొక్కగానే ప్రపంచం కాస్త నియంత్రణలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇయర్‌ఫోన్స్ మన దృష్టిని కేంద్రీకరించేందుకు సహాయపడతాయి. చుట్టూ ఉన్న శబ్దాలను తగ్గించి పని మీద ఫోకస్ పెంచుతాయి. కానీ ఎక్కువసేపు, అధిక వాల్యూమ్‌లో వాడితే వినికిడి, ఏకాగ్రత, మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకు మనం ఇయర్‌ఫోన్స్‌పై ఆధారపడుతున్నాం? వాటిని సురక్షితంగా ఎలా వాడాలి? అనే విషయాలను నిపుణులు వివరిస్తున్నారు.

శబ్దభరిత వాతావరణాల్లో హెడ్‌ఫోన్స్ నిజంగానే ఏకాగ్రతను పెంచుతాయి. అవసరం లేని శబ్దాలను తగ్గించడం ద్వారా మెదడుకు తక్కువ సమాచారం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి పని మీద దృష్టి నిలబడుతుంది. అయితే ఇయర్‌ఫోన్స్ అప్పుడప్పుడు వాడే సాధనంగా కాకుండా ఎప్పుడూ తోడుగా మారితే సమస్యలు మొదలవుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

మన మెదడు శబ్దాలకు చాలా సున్నితంగా స్పందిస్తుంది. రద్దీ ప్రదేశాల్లో ఒకేసారి ఎన్నో శబ్దాలను వడపోసుకోవాల్సి రావడంతో ఏకాగ్రత తగ్గుతుంది. ఇయర్‌ఫోన్స్ ఆ శబ్దాలను తగ్గించి మెదడును కూల్‌గా ఉంచుతాయి. అందుకే పని, చదువు, ప్రయాణం, ఇంటిపనుల సమయంలో కూడా చాలామంది వాటిని వాడతారు. కానీ వాల్యూమ్, వాడే సమయం నియంత్రణలో లేకపోతే కొత్త సమస్యలు తలెత్తుతాయి.

వైద్య పరిశోధనల ప్రకారం, ఎక్కువసేపు పెద్ద శబ్దాలకు గురైతే చెవిలోని సున్నిత భాగాలు దెబ్బతింటాయి. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం వినిపిస్తే నాయిస్ ఇండ్యూస్‌డ్ హియరింగ్ లాస్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువసేపు ఆడియో వింటే ఏకాగ్రత తగ్గడం, మానసిక అలసట, మాట్లాడే మాటలు పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవులు మాత్రమే కాదు, మెదడూ అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక బయట శబ్దాలు పూర్తిగా ఆపేయడం వల్ల పరిసర పరిస్థితులపై అవగాహన తగ్గుతుంది. సహజ శబ్దాలకు స్పందించే మెదడు సామర్థ్యం క్రమంగా మందగించే అవకాశం ఉందని కొందరు ఆడియాలజిస్టులు సూచిస్తున్నారు. రోజుకు రెండు గంటలకంటే ఎక్కువ ఇయర్‌ఫోన్స్ వాడే వారిలో దృష్టి చెదరడం, జ్ఞాపకశక్తి స్వల్పంగా తగ్గడం కనిపించవచ్చు. కారణం నిరంతర శబ్ద ప్రేరణ వల్ల మెదడు ఎప్పుడూ అలర్ట్ మోడ్‌లో ఉండడం. క్షణికంగా ఫోకస్ అనిపించినా, దీర్ఘకాలంలో మానసిక స్పష్టత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

ఇయర్‌ఫోన్స్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కానీ మితంగా వాడాలి. మోస్తరు వాల్యూమ్‌లో వినడం, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం, ఎక్కువసేపు వినకపోవడం చాలా ముఖ్యం. ఇయర్‌బడ్స్ కంటే ఓవర్-ది-ఇయర్ లేదా నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంత సురక్షితం. అయినా మొత్తం వినే సమయాన్ని తగ్గించాలి.

Also Read:KTR:కాంగ్రెస్ పాలనలో మార్పు లేదు..తిరోగమనమే

- Advertisement -