ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. మరో ఐదు రోజులు నవంబర్ 8న ఓటింగ్ అగ్రరాజ్యం ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై వూహాగానాలు జోరుగానే సాగుతున్నాయి. ఆది నుంచి ట్రంప్ పై హిల్లరీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చింది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఇద్దరి మధ్య హోరాహోరిగా మారింది. నువ్వా నేనా అంటూ సాగుతున్నపోరులో గెలుపెవరిదా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఓటింగ్ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇప్పటికే బరాక్ ఒబామా సొంత నగరం షికాగోలో ముందస్తు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు సుమారు 2 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు ‘ముందస్తు ఓటింగ్ విధానం’ వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అమెరికా మాజీ అధ్యక్షడు బిల్‌క్లింటన్ పాల్గొన్న ఒక బహిరంగ సభలో ఈ విషయం వెల్లడైంది. 2008 నుంచీ చూస్తే ముందస్తు ఓటింగ్ విధానానికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. 2008లో అమెరికన్ ఓటరు జనాభాలో 30 కంటే ఎక్కువ శాతం మంది ముందస్తు ఓటు వేసేశారు. 2012 వచ్చేసరికి కోటీ 26 లక్షల మంది ముందస్తు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ట్రంప్‌పై అమెరికా అధ్యక్షుడు ఒబామా మరో సారి విరుచుకుపడ్డారు. ట్రంప్‌ను ఎన్నుకుంటే ప్రపంచం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. నార్త్ కరొలినాలోజరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ పౌర హక్కులకు ట్రంప్ ప్రమాదకారి అని ఆరోపించారు.బ్యాలెట్ పేపర్ అంటే అభివృద్ధి, న్యాయం, ప్రజాస్వామ్యం అని అన్నారు. ట్రంప్‌ను వైట్‌హౌస్‌కు రాకుండా అడ్డుకోవడానికి ఓటు హక్కే సరైనమార్గమన్నారు.
దేశ అధ్యక్ష పదవికి హిల్లరీ తగిన అభ్యర్థి అని…గత ఎనిమిది సంవత్సరాలుగా అమెరికా సాధించిన అభివృద్ధి కొనసాగుతూ మరింతగా దూసుకుపోవాలంటే హిల్లరీని బలపర్చాలన్నారు. చరిత్ర సృష్టించే అవకాశాన్ని వదులు కొవద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక ముందస్తు ఓటింగ్ హిల్లరీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ట్రంప్,హిల్లరీ మధ్య పోరు రసవత్తరంగా మారినప్పటికి హిల్లరీదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు.