హర్యానా యువసంచలనం…దుష్యంత్ చౌతాలా

561
haryana dushyanth
- Advertisement -

హర్యానా ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు పార్టీ పెట్టిన 10 నెలలకే కింగ్‌ మేకర్‌గా మారారు హర్యానా యువ సంచలనం జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా.

38 స్థానాల్లో ఆధిక్యం సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన మేజిక్ ఫిగర్ మార్క్‌ 46ని చేరుకోలేకపోయింది. దీంతో 32 స్ధానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ 11 స్థానాలతో మూడో స్థానంలో ఉన్న జేజేపీకి ఆ పార్టీ సీఎం పదవిని ఆఫర్ చేసింది.

దీంతో ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు దుష్యంత్ చౌతాలా. కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు జేజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ఇప్పుడు ఆయన గురించే చర్చ జరుగుతోంది.

ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు దుష్యంత్ చౌతాలా. 1988లో జన్మించిన దుష్యంత్ 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి దేశంలోనే పిన్నవయస్కుడైన ఎంపీగా రికార్డు క్రియేట్ చేశారు. 2018 డిసెంబర్ 9న ఆయన్ను ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) బహిష్కరించింది.

ఐఎన్‌ఎల్‌డీ నుంచి బయటకొచ్చిన దుష్యంత్ ..జేజేపీని ఏర్పాటు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో జేజేపీ తరఫున పోటీ చేసిన దుష్యంత్.. బీజేపీకి చెందిన బ్రిజేంద్ర సింగ్ చేతిలో ఓడారు. కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సత్తాచాటి ట్రెండ్ సెట్టర్‌గా మారారు. హర్యానాలో 29 శాతం ఉండే జాట్‌లు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలో జేజేపీ‌కి మద్దతుగా నిలిచారు. అమెరికాలో చదువుకున్న చౌతాలా అరిజోనా అత్యున్నత పౌరపురస్కారం పొందిన తొలి భారతీయుడు కావడం విశేషం.

- Advertisement -