ఆగస్టు 19న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కలింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పో్యిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులకే ఆగస్టు 24న అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
అజమ్‌గఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదాలు మరవకముందే.. మరో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. వాసింద్, అసంగావ్ స్టేషన్ల మధ్య టిట్వాలా సమీపంలో ఇంజిన్‌తో సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి తోడు ఓ వైపు వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా..ముంబైలో ఇటీవలే ఓ లోకల్ రైలు కూడా పట్టాలు తప్పింది. కలింగ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన తరవాత ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే తొందర పడొద్దని, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోమని సురేష్ ప్రభుకు ప్రధాని సూచించారు. ఆయన రాజీనామాకు సిద్ధపడిన తరవాత మరో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడం గమనార్హం.