దుబాయ్ లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం చాటుకుంది. తెలంగాణకు చెందిన వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన కోటి 52లక్షల రూపాయల బిల్లుని మాఫీ చేసింది. అంతేకాదు ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు రూ.10వేలు ఇచ్చి అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన ఓడ్నాల రాజేష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడ్డాడు.దీంతో స్ధానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. దాదాపు 80 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన రాజేష్…పూర్తిగా కొలుకున్నాడు.
అయితే ఇప్పటివరకు అంతాబాగానే ఉన్న తీరా బిల్లు చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. కోటి 52లక్షల రూపాయల బిల్లు కట్టలేమని ఆస్పత్రి వర్గాలకు భారత ఎంబసీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రాజేష్ బాధ విన్న భారత ఎంబసీ అధికారులు ఆస్పత్రి యాజమాన్యానికి లేఖ రాయగా మానవీయ కోణంలో ఆలోచించిన సదరు ఆస్పత్రి బిల్లును పూర్తిగా మాఫీ చేసింది.
దీంతో రాజేష్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యానికి, భారత ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటి 52లక్షల బిల్లుని పెద్ద మనసుతో మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.