ఎండాకాలంలో వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలమంది సేవించే ద్రవరూప పానీయాలలో కొబ్బరి నీళ్ళు మొదటి స్థానంలో ఉంటాయి. వేసవిలో వీటికి యమ డిమాండ్ ఉంటుంది. ఎండలో అలసట బారిన పడినప్పుడు వెంటనే దగ్గరలోని కొబ్బరిబోండాల షాప్ కు వెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగి సేద తీరుతుంటాము. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో కొబ్బరి నీళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. .ఇందులో మినరల్స్ అధికంగా ఉంటాయి. అందుకే కొబ్బరి నీళ్ళు డీహైడ్రేషన్ బారినుంచి కాపాడతాయి. అంతే కాకుండా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు కూడా కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మానసిక ఆందోళన, అలసట దూరమవుతాయి. ఇంకా జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. మూత్రంలో మంటను తగ్గిస్తాయి. ఇలా కొబ్బరినీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాలు అనేకం. .
అయితే వీటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నప్పటికి అతిగా తాగితే ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో కొబ్బరినీళ్ళను అమితంగా సేవించడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొబ్బరి నీళ్ళలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వీటి పరిమాణం ఎక్కువైతే.. విరోచనాలు సంభవించే ప్రమాదం ఉందట. అంతే కాకుండా కొబ్బరి నీళ్ళు అతిగా తాగితే మైకం, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కిడ్నీ వ్యాధి గ్రస్తులు, గుండె సమస్యలు ఉన్నవారు సైతం కొబ్బరి నీళ్ళు అతిగా తాగరాదట. ఒకవేళ తాగాల్సివస్తే వైద్యుల సూచనల మేరకు మాత్రమే సేవించాలి. కాబట్టి వేసవిలో ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తగేందుకు ఇష్టపడేవారు కొంత జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read:వార్ 2..క్రేజీ అప్‌డేట్!