కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల ప్రవేశాన్ని నిషేధించడం సమర్థనీయమా? కాదా? అన్న అంశాన్ని తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు గోపాలకృష్ణన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించినప్పటికీ.. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరని వ్యాఖ్యానించారు.
ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు నివేదించినప్పటికీ.. తమ వైఖరికే తాము కట్టుబడి ఉంటామని గోపాలకృష్ణన్ తెలిపారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.
‘శబరిమల క్షేత్రాన్ని థాయ్‌లాండ్‌గా మార్చేందుకు మేం ఒప్పుకోం. మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఒకవేళ కోర్టు మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. స్వగౌరవం ఉండే మహిళలు ఈ ఆలయంలోకి రారు.’ అని గోపాలకృష్ణన్ స్పందించారు.