పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ప్రచార పర్వాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కొంతకాలంగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించడంపై స్పందిస్తూ, బీజేపీ పెద్దలను దుర్యోధనులు, దుశ్శాసనులతో పోల్చారు. మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలను ధుర్యోధనులు, ధశ్శాసనులు, మిర్ జాఫర్లగా అభివర్ణించారు. పర్బా మిడ్నాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. తమ పార్టీని వీడిన నేతలను ద్రోహులని అన్నారు. బీజేపీని బయట నుంచి వచ్చిన నేతల పార్టీగా వ్యాఖ్యానించారు. బెంగాల్ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఓటర్లకు సూచించారు. యూపీలో మహిళను రేప్ చేసి హత్య చేశారని.. ఆమె తండ్రిని ఇటీవల హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదని మమత అన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం పేరుతో బీజేపీ నేతలు దేశ సొమ్మను దోచుకుంటున్నారని మండిపడ్డారు. అలా దోచుకుంటున్న నేతలెవరో ఎప్పటికీ తెలియదని అన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చిన మమతా బెనర్జీ.. సీపీఎం, కాంగ్రెస్‌కు కూడా ఓటు వేయొద్దని అన్నారు. వాళ్లిద్దరూ బీజేపీ స్నేహితులే అని ఆరోపించారు.