త్రిపుల్ తలాక్.. ముస్లిం సాంప్రదాయంలో ఉన్న ఈ విధానంపై రకరకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోయేది ముస్లిం మహిళలేనని, త్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ.. ఇప్పటికే కొంతమంది ముస్లిం స్త్రీలు కోర్టును ఆశ్రయించారు.
ముస్లింల సాంప్రదాయం ప్రకారం మూడుసార్లు తలాక్ అంటే మహిళకు విడాకులు ఇచ్చే ముస్లిం పర్సనల్ లా త్రిపుల్ తలాక్ విధానంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో త్రిపుల్ తలాక్ అమలుపై.. ముస్లింల పర్సనల్ లా పై కేంద్రంలో జోరుగా చర్చ జరుగుతోంది.
అయితే ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీ మరో సారి స్పంధించారు. ట్రిపుల్ తలాక్ అంశాన్ని రాజకీయంగా చూడొద్దన్నారు. తలాక్ చెప్పేసి భార్యను వదిలించుకునే పద్ధతి సరికాదని, ముస్లిం మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని అన్నారు. కన్నడ తత్వవేత్త బసవేశ్వర్ జన్మ వార్షికోత్సవం సందర్భంగా 40 నిమిషాల పాటు ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ.
సంస్కరణలతో ముస్లిం మహిళలకు రక్షణ కలిగించాలని, చెడు పద్ధతుల నుంచి ముస్లిం మహిళలను రక్షించుకునే సంస్కరణలకు మత పెద్దలు దారులు వెతుకుతారని ఆశిస్తున్నానన్నారు మోదీ. ట్రిపుల్ తలాక్ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడడం ఇది రెండో సారి… కొన్ని రోజుల క్రితం ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడిన మోదీ..ముస్లిం మహిళలకు అన్యాయం చేయరాదని వ్యాఖ్యానించారు.