అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నారు.డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన కంపెనీలపై వందకుపైగా పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. డజన్లకొద్దీ వారెంట్లు ఉన్నాయి. కొన్ని కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకు ఆయన కంపెనీలు దాదాపు మూడు లక్షల డాలర్ల బకాయిలను చెల్లించాయి. ఇంకా అనేక కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజీ మార్గంలో వెళుతున్నారు ట్రంప్.
తాజాగా ట్రంప్ యూనివర్శిటీపై ఉన్న మూడు కేసుల సెటిల్ మెంట్ కోసం ఆయన భారీ మొత్తంలో విద్యార్థులకు ఆఫర్ చేశారు. దాదాపుగా 25మిలియన్ డాలర్లు (సుమారు రూ. 170 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యాడట. మూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసులో వాది, ప్రతివాదుల మధ్య డీల్ కుదిరిందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షినైడర్ మ్యాన్ వెల్లడించారు.
దీంతో పాటు ట్రంప్ వర్శిటీ మాజీ విద్యార్థులు కాలిఫోర్నియాలో వేసిన రెండు కేసుల్లోనూ రాజీ కుదిరిందన్నారు. నిర్మాణ రంగంలో నిష్ణాతులను చేస్తామని చెబుతూ, ఒక్కొక్కరి నుంచి 35 వేల డాలర్లను కట్టించుకున్న యూనివర్శిటీ సరిగ్గా పాఠాలు చెప్పలేదని, ఈ స్టడీ ప్రోగ్రామ్ తమను తప్పుదారి పట్టించిందని విద్యార్థులు కోర్టును సంప్రదించారు. ఈ కేసులో ట్రంప్ వర్శిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు ఉండటం, విద్యార్థులు నెగ్గితే, అధ్యక్ష హోదాలో పరువు పోతుందని భావించడంతోనే ఆయన భారీగా డబ్బు చెల్లించి కేసుల నుంచి బయటపడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇక ట్రంప్‌పై న్యూయార్క్‌తోపాటు నెవడా, ఫ్లోరిడా, న్యూజెర్సీ కోర్టుల్లో కూడా ట్రంప్ కంపెనీలపై పన్ను ఎగవేత కేసులున్నాయి. ఆయన కంపెనీలు గత 27 ఏళ్ల కాలంలో కేసుల కారణంగా మూడు లక్షల డాలర్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. 1990 నుంచి 2011 నాటికి న్యూయార్క్ సిటీ ట్యాక్స్ కమిషన్ ట్రంప్ కంపెనీలపై 55 కేసులు దాఖలు చేసింది. 2006 నుంచి 2007 మధ్య ట్రంప్ మార్ట్‌గేజ్ కంపెనీ కూడా 4,800 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉందని ఓ పత్రిక తన కథనంలో పేర్కోంది.