అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. రసవత్తరంగా సాగిన మూడో డిబెట్‌లో హిల్లరీ,ట్రంప్ మధ్య వ్యక్తిగత దూషణల పర్వంగా మారింది. లాస్ వెగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నెవడాలో డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన మూడవ డిబేట్‌లో ఇరువురు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు పోటీపడ్డారు. తొలి రెండు ముఖాముఖి పోరులో హిల్లరీ ఆధిక్యం సాధించగా… ట్రంప్ వెనకబడ్డారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మెచ్చుకున్న ట్రంప్‌పై హిల్లరీ తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్‌కు ట్రంప్ కీలుబొమ్మగా మారాడన్నారు. హిల్లరీపైన కూడా ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ (నాస్టీ వుమెన్) దుష్ట మహిళ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అని మాడరేటర్ అడిగిన ప్రశ్నకు మాత్రం ట్రంప్ భిన్నమైన సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించబోనన్నారు. తనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఆరోపించారు. ఫలితాలు వచ్చినప్పుడు అసలు విషయాన్ని చెబుతాను, అంత వరకు సస్పెన్స్‌లోనే ఉండాలన్నారు.
హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు వూతమిస్తానన్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తా నని హామీ ఇచ్చారు. ట్రంప్‌కు దేశ నిఘా వర్గాల మీద నమ్మకం లేదని విమర్శించారు. దేశ నిఘా అధికారుల కంటే ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతారని.. కానీ అణు ప్రయోగం చేసేవారు మాత్రం ట్రంప్‌ను విశ్వసించడం లేదన్నారు. శ్వేతసౌధంలో కీలుబొమ్మ ఉండాలని పుతిన్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించడమే ట్రంప్ విజయం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
హిల్లరీ అబద్ధాలు ఆడుతున్నారని, ఆమెనే అనేక నేరాలకు పాల్పడ్డారని, ప్రభుత్వంలో ఉంటూ ప్రైవేటు ఈ-మెయిళ్లను వాడారాని ట్రంప్ ఆరోపించారు. ఆయుధాల నియంత్రణ చట్టానికి హిల్లరీ మద్దతు పలుకగా, దాన్ని ఎత్తివేస్తానని ట్రంప్ అన్నారు. మరోవైపు ఒబామాపై కూడా ట్రంప్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో విఫలమయ్యారని….దేశంలోకి మత్తు పదార్ధాలను రానివ్వకుండా చేయలేకపోయారని అన్నారు. ఒబామా లక్షల మందిని బయటకు పంపారని…హిల్లరీ ఆ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
అధ్యక్ష ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం హిల్లరీ ముందంజలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్‌లోనూ డెమోక్రటిక్ అభ్యర్థికే అనుకూలత ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.