మరోసారి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

7
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను ఉద్దేశించి హేళనగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్‌ పార్టీ చట్టసభ సభ్యుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌, ఫ్రాన్స్‌పై తాను తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో మెక్రాన్‌ తనను ప్రాధేయపడ్డారని వ్యాఖ్యానించారు.

ఫ్రాన్స్‌ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని తాను హెచ్చరించిన తర్వాత మెక్రాన్‌ “ప్లీజ్‌ డొనాల్డ్‌…” అంటూ వేడుకున్నారని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్‌ సరదాగా చేసినట్లు కనిపించినా, అంతర్జాతీయ దౌత్యంలో ఇది అవమానకరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రదేశాల నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కు కొత్తేమీ కాదని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

టారిఫ్‌ల విషయంలో ట్రంప్‌ ఎప్పటినుంచో కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. అమెరికా ప్రయోజనాలే ప్రథమ లక్ష్యమని చెబుతూ, వాణిజ్య లోటును తగ్గించడమే తన ప్రభుత్వ విధానమని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అదే క్రమంలో ఫ్రాన్స్‌పైనా టారిఫ్‌ల హెచ్చరికలు జారీ చేయడం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఈ వ్యాఖ్యలు అమెరికా–ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. మరోసారి ట్రంప్‌ మాటలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారి తీసినట్టయ్యాయి.

Also Read:Nani:ది ప్యారడైజ్..ఫస్ట్ సింగిల్!

- Advertisement -