క్రాస్ బ్రీడింగ్ వల్ల కొన్ని దేశవాళీ ఆవులు కనుమరుగు అయిన వేళ…సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ ద్వారా దేశవాళీ ఆవులను బతికించడం చాలా గొప్ప విషయమన్నారు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్. క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలని సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ అల్లోల దివ్యారెడ్డి… ఎంపీ సంతోష్ కుమార్ ను కోరారు. మంగళవారం ప్రగతి భవన్ లో ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు.
హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాలనే కర్తవ్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సీడ్ గణేషా లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దేశవాళీ ఆవుల, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూతను అందించాలని ఎంపీ సంతోష్ కుమార్ ను కోరారు. రోగ నిరోధక శక్తిలో, పాల నాణ్యతలో దేశీ ఆవులకు సాటిరాని హైబ్రీడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతులను అరికట్టి దేశవాళీ ఆవుల పోషణ వృద్ధి చెందేలా మన రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చెపడుతున్న సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్ సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గత జన్మలో చేసుకున్న పుణ్యమన్నారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రామాన్ని సామాజిక బాధ్యతగా ముందుండి నిర్వహిస్తున్న దివ్యారెడ్డి కృషిని ఎంపీ సంతోష్‌కుమార్ అభినందించారు.