ఏపీలోని నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకంగా మొన్న రాత్రి నుండి వర్షాల తీవ్రత మరింత పెరిగి, జిల్లాలోని అనేక మండలాల్లో ఏకధాటిగా భారీ వర్షపాతం నమోదవుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారి, రోడ్లు, కాలనీలు, పల్లెలు నీటితో నిండిపోయాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా ఆశ్రయాల కోసం అధికారులు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు మాత్రమే కాకుండా పట్టణాల్లో కూడా భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
అలాగే జాతీయ రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చెన్నై–కోల్కతా నేషనల్ హైవే పలు చోట్ల వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర ప్రయాణాల్లో ఉన్నవారు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దిత్వా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతుందన్న వాతావరణ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Also Read:మోనాలిసా.. ‘లైఫ్’ మొదటి షెడ్యూల్

