వరంగల్ డిఆర్ఎఫ్ బృందాలకు శిక్షణ

594
ghmc
- Advertisement -

న‌గ‌రంలో ఈదురుగాలుల‌తో కూడిన ఆక‌స్మిక వ‌ర్షాలకు కూలిన చెట్ల‌ను రికార్డ్‌ స్థాయిలో తొల‌గించ‌డం, రోడ్ల‌పై ఏర్ప‌డ్డ నీటి నిల్వ‌ల‌ను వెంట‌నే తొల‌గించి ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లుగ‌కుండా చేయ‌డంతో పాటు కూలిన విద్యుత్ స్తంభాలు, ఇళ్లను, ఎల్బీ స్టేడియంలోని ఫ్ల‌డ్ లైట్ ట‌వ‌ర్‌ను తొల‌గించ‌డం, ఆపదలో ఉన్నజంతువులు, పక్షులను రక్షించడం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ప్రథమ చికిత్సలు చేయడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం త‌దిత‌ర చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం ద్వారా జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఈ.వి.డి.ఎం) దేశంలోని ఇత‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌కు ఆద‌ర్శంగా నిలిచింది.

దేశంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో కేవలం ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లోనే విప‌త్తుల నిర్వ‌హ‌ణ కై ప్ర‌త్యేక‌ విభాగం ఉంది. అయితే ముంబాయి కార్పొరేషన్ కన్నా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఈ.వి.డి.ఎం విభాగాన్ని తగు సుశిక్తులైన సిబ్బంది, తగు వాహనాలు, పరికరాలు, ఆధునిక సాంకేతిక వ్యవస్థ, ఫిర్యాదులను స్వీకరించే కంట్రోల్ రూం తదితర హంగులతో ఏర్పాటైంది. దాదాపు 220మంది సిబ్బందితో 13 బృందాలు న‌గ‌రంలోని 24గంటల పాటు నగరంలోని కీలక ప్రాంతాల్లో మూడు షిఫ్ట్ లుగా విధినిర్వ‌హ‌ణలో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇటీవల కాలంలో అతితక్కువ వ్య‌వ‌ధిలోనే 70కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన అక‌స్మిక వ‌ర్షం కురియ‌డం, ఆకస్మిక వరదలతో బస్తీలు, కాలనీలు నీట మునగడం, ఆకస్మిక ప్రమాదాలు జరగడం సాధారణంగా మారింది.

ఈ నేప‌థ్యంలో కీల‌క ప్రాంతాల్లో ఉన్న విప‌త్తుల నివార‌ణ బృందాలు రంగంలోకి దిగి రోడ్ల‌పై ప‌డ్డ చెట్ల‌ను, తెగిప‌డ్డ విద్యుత్ తీగ‌లు, స్తంభాలను వెంట‌నే తొల‌గిస్తున్నాయి. గత సంవత్సర కాలంగా జీహెచ్ఎంసీ ఈవిడీఎం కంట్రోల్ రూంకు న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల‌న్నింటిని అతితక్కువ సమయంలోనే ప‌రిష్క‌రించడంతో పాటు కూలిన చెట్ల‌ను పూర్తిగా తొల‌గించి రాకపోకలకు సుగమం చేస్తున్నారు. ఇటీవల రామంత‌పూర్‌లోని వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి ఆల‌యంలో ఉన్న భారీ రావిచెట్టు కూలింది. అత్యంత పురాత‌న ఆల‌యంలో ఉన్న ధ్వ‌జ‌స్తంభంపైన, గుడిపైన చెట్ల కొమ్మ‌లు ప‌డ‌కుండా అత్యంత జాగ్ర‌త్త‌గా కూలిన వృక్షాన్ని డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు తొల‌గించాయి. దీంతో పాటు ఆడిక్‌మెంట్ రామాల‌యంలో ఉన్న 40ఏళ్ల చెట్టు కూడా కూల‌డం, ఈ కూలిన వృక్షాన్ని దేవాల‌యానికిగాని, ప‌రిస‌ర ప్రాంతాల ఇళ్ల‌పై కానీ ప‌డ‌కుండా సుర‌క్షితంగా తొల‌గించారు. చెట్లు కూలిన ఫిర్యాదులను అందుకున్న వెంట‌నే డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని అతిత‌క్కువ స‌మ‌యంలో కూలిన చెట్ల‌ను తొల‌గించి రాక‌పోక‌లకు ఇబ్బందులులేకుండా చేశాయి.

జీహెచ్ఎంసీలో డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటైన కేవ‌లం సంవ‌త్స‌రంన్నర కాలంలోనే ఈ విభాగంలోని 220 మంది సిబ్బందికి విప‌త్తుల నిర్‌ఘహ‌ణ‌లో సుశిక్తులుగా చేయ‌డంతో న‌గ‌రంలో ఏవిధ‌మైన విప‌త్తులు సంభ‌వించినా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కునే ఫోర్స్ జీహెచ్ఎంసీ క‌లిగి ఉంద‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌, డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి తెలిపారు. విప‌త్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన అత్యాధునిక మిష‌న‌రి, టూల్స్‌ల‌ను కూడా సేక‌రించుకోవ‌డం జ‌రిగింద‌ని, ఈ విప‌త్తు నివార‌ణ బృంద స‌భ్యుల భ‌ద్ర‌తకు కూడా అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ట్టు విశ్వ‌జిత్ తెలియ‌జేశారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లైనా ఎదుర్కునేందుకు డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ సిద్దంగా ఉంద‌నే స్థైర్యం న‌గ‌ర‌వాసుల్లో ఏర్ప‌డింద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. విపత్తు సంఘటన స్థలాలకు మరింత వేగంగా చేరుకోవడానికి ఇటీవలే మోటార్ సైకిళ్లను కూడా ప్రవేశపెట్టామని విశ్వజిత్ తెలిపారు. కాగా నగరంలో భారీ వ‌ర్షాల‌కు డి.ఆర్‌.ఎఫ్ బృందాలు అందించిన సేవ‌ల‌ను న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సాధార‌ణ ప్ర‌జానికం ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ త‌దిత‌ర సోష‌ల్ మీడియా వేదిక ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

జిహెచ్ఎంసిలో ప్రారంభించిన ఈ.వి.డి.ఎం ప్రత్యేక విభాగం ఉన్నత ఫలితాలు ఇస్తుండడంతో ఇదే రకమైన విభాగాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించిన విషయం విదితమే. దీనిలో భాగంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ నెల 5వ తేదీన డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ను ప్రారంభించనున్నారు. ఈ డి.ఆర్.ఎఫ్ విభాగంలో ప్రత్యేకంగా నియమించిన 23మంది సిబ్బందికి విపత్తుల నిర్వహణ, కూలిన భవనాలు, వృక్షాలను తొలగించడం, అగ్నిప్రమాదాల పట్ల వెంటనే స్పందించడం, తుఫాన్ లు, వరదల వల్ల ఏర్పడే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం తదితర అంశాలపై జిహెచ్ఎంసి ఈ.వి.డి.ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

- Advertisement -