వర్గాలు, వరదల నేపధ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు, అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, రేయింబవళ్లు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. డిల్లి పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వరదలు, వానలు, వాటి వల్ల తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. దాదాపు అందరు మంత్రులతో స్వయంగా పోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, కమీషనర్ జనార్థన్ రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు తదితరులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఎన్.డి.ఆర్.ఎఫ్, సైనిక దళాలను అధికారులు సిద్ధం చేశారు. 60 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం హైదరాబాద్ లో సిద్ధంగా ఉంది. అవసరాన్ని బట్టి వారి సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు మూడు రోజుల నుంచి భారీ వర్ణాలు కురవడంతో పాటు మరో రెండు రోజుల పాటు భారీ వర్ణాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ చెబుతున్నందున అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులకు కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి, ఇండ్లలోకి వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాత్రి, పగలు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను సిఎం ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన మంత్రులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు పడుతున్నాయని, వరదలు వస్తున్నాయని, కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు.
ఏ జిల్లాకు చెందిన మంత్రి తన శాఖతో పాటు తన జిల్లాకు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి సూచనలు, ఫిర్యాదులు, వారి బాధలు తెలుసుకోవాలని, అందుకు అనుగుణంగా స్పందించాలని ఆదేశించారు. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చినట్లు సమాచారం అందిందని, ఈ పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పరచాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా ప్రయాణాలు చేయకుంటే మంచిదని ముఖ్యమంత్రి చెప్పారు.
వర్గాల వల్ల, ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న నీటి వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులలోకి నీరు వస్తున్నదని, చెరువులు నిండుతున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉదృతిని గమనిస్తూ, నీటి నిల్వ స్థాయిలను బట్టి నీరును బయటికి వదలాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు తదితర రిజర్వాయర్ల వద్ద 24 గంటల మానిటరింగ్ అవసరమని సీఎం చెప్పారు. ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు గమనిస్తూ, దానికి అనుగుణంగా ఔట్ ప్లో నిర్ధారించాలని ఆదేశించారు. చాలా చెరువుల్లోకి నీరు వచ్చిందని, చెరువు కట్టల పరిస్థితిని కూడా గమనిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పనులు చేసిన ఫలితాన్ని కూడా ప్రజలు తమ గమనంలోకి తీసుకున్నారని సిఎం చెప్పారు. చెరువులు నిండడంతో పాటు, కట్టలు బలంగా తయారయ్యాయని, లేకుంటే చాలా కట్టలు తెగి ఉండేవని సిఎం అన్నారు. మిషన్ కాకతీయ పనులు జరగని చెరువుల కట్టలు బలహీనంగా ఉన్నందున అధికారులు వాటిని గమనించాలని కోరారు. చెరువు కట్టలు తెగినా, బుంగలు పడినా వెంటనే స్పందించే విధంగా యంత్రాంగం, సామాగ్రిని సిద్ధంగా ఉంచాలని మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశం మేరకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించారు. ప్రాజెక్టులు,రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితిని గమనించి, సమాచారం సేకరించి, తగు ఆదేశాలు ఇవ్వడానికి 24 గంటలూ పనిచేసే విధంగా జలసౌధలో కంట్రోల్ రూమ్ (04023390794) ఏర్పాటు చేశారు.
నిజాంసాగర్, ఎల్ఎండి, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి , సింగూరు, మిడ్ మానేరు వద్ద కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి సిఇ స్థాయి అధికారులను నియమించారు. రాత్రంతా తాను కూడా అందుబాటులో ఉంటానని, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని మంత్రి హరీష్ కోరారు.రోడ్లపైకి, జనావాసాల్లో నీరు రావడం వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని సిఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, రేయింబవళ్లు అత్యవసర సేవలు అందించడానికి అదికారులను సిద్ధం చేయూలని సిఎం సూచించారు.
వర్షాల నేపధ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని జెన్ కో సిఎండి ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే సమస్యను పరిష్కరించడానికి సిద్దంగా ఉండాలన్నారు. జెన్ కో, ట్రాన్స్ కో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకుని, ప్రజల నుంచి వచ్చే వినతులు, సలహాలు స్వీకరించాలని సూచించారు. పోలీస్ శాఖ కూడా అన్ని విధాలా సిద్దంగా ఉండి, అవసరమైన సందర్భంలో ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి కోరారు.