దేశానికి సేవ చేసే టైమ్ వ‌చ్చింది: పూరి జ‌గ‌న్నాథ్‌

292
puri jagan
- Advertisement -

ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే టైమ్ వ‌చ్చింది. ద‌య‌చేసి ఆ ప‌ని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి” అని పిలుపునిచ్చారు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌. క‌రోనా వైర‌స్‌ ఊహాతీతంగా విజృంభిస్తోంద‌నీ, దాన్ని అదుపు చేయ‌క‌పోతే మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగుతుంద‌నీ ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అంద‌రూ స‌హ‌క‌రించి క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఆయ‌నిచ్చిన వీడియో సందేశాన్ని మంగ‌ళ‌వారం న‌టి, నిర్మాత చార్మీ కౌర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దానికి “లాక్‌డౌన్ త‌ప్ప‌నిస‌రి” అనే కాప్ష‌న్‌ను జోడించారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ, “గ్లోబ‌ల్ వార్మింగ్‌, క్లైమేట్ చేంజ్‌, గ్రీన్ గ్యాసెస్.. ఇలాంటి మాట‌లు విన్న‌ప్పుడు 90 శాతం మ‌నం జోకులు వేస్తుంటాం. ప‌క్క‌నోడు ఎవ‌డైనా ఇలాంటి టాపిక్ ఎత్తినా ‘అబ్బా ఛా.. నీకెందుకురా?’ అని ఓవ‌రాక్ష‌న్ చేస్తుంటాం. ఆస్ట్రేలియాలో రెండు నెల‌లు అడ‌వి త‌గ‌ల‌బ‌డుతున్నా మ‌నం ప‌ట్టించుకోం. 30 శాతం ఆక్సిజ‌న్ ఇచ్చే అమెజాన్ ఫారెస్ట్ త‌గ‌ల‌బ‌డుతున్నా ప‌ట్టించుకోం. ఆర్కిటిక్ ఐస్ క‌రిగిందంటే మ‌నం జోకులేస్తాం. కానీ క‌రోనా వ‌చ్చి ఇప్పుడు అంద‌రి చెంప‌లూ లాగి కొట్ట‌బోతోంది. ఇప్పుడు మ‌న‌కు అన్నీ అర్థ‌మ‌వుతాయ్‌. వియ్ ఆర్ ఆల్ క‌నెక్టెడ్ అనే విష‌యం తెలుస్తుంది.

ఎక్కువ సంద‌ర్భాలు వైర‌స్‌ల‌న్నీ సిటీల‌లోనే పుడ‌తాయ్‌. అడ‌విలో పుట్ట‌వు. జ‌న‌భా వ‌ల్లే అవి న‌గ‌రాల్లో పుడ‌తాయ్‌. అడ‌విలో ఎందుకు పుట్ట‌వంటే, అక్క‌డి జంతువుల‌న్నీ ప్ర‌కృతిలో బ‌తుకుతాయి. మ‌నుషులు మాత్రం ప్ర‌కృతికి విరుద్ధంగా బ‌తుకుతారు. దాని వ‌ల్ల అన్ని వైర‌స్‌లూ పుడుతుంటాయ్‌. 1918లో స్పానిష్ ఫ్లూ వ‌చ్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500 మిలియ‌న్ల మంది చ‌నిపోయారు. ఇండియాలో ప్లేగు వ‌చ్చి 15 మిలియ‌న్ల మంది చ‌నిపోయారు. నా చిన్న‌ప్పుడు క‌ల‌రా వ‌చ్చింది. ప్ర‌తి ఊళ్లో జ‌నం చ‌చ్చిపోయేవారు. ప్ర‌తి ఊరినీ బ్లీచింగ్ పౌడ‌ర్ చ‌ల్లి ఉంచేవారు. అప్పుడు ఇండియాలో చనిపోయిన‌వాళ్ల సంఖ్య 40 మిలియ‌న్ల‌ నుంచి 50 మిలియ‌న్ల మంది. ఆవేళ మీడియా లేదు కాబ‌ట్టి మ‌న‌కు పెద్ద‌గా తెలీదు. అలాగే మ‌లేరియా వ‌ల్ల స‌గ‌టున ఏడాదికి 1 మిలియ‌న్ మంది చ‌నిపోతుంటారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌క‌ర‌కాల వ్యాధుల‌తో చ‌నిపోతుంటారు. వీటికి తోడు ఇప్పుడు క‌రోనా వ‌చ్చింది. ఇదివ‌ర‌క‌టి వ్యాధుల‌తో పోలిస్తే క‌రోనా చావులు చాలా త‌క్కువ‌. ఇప్పుడు క‌నుక దాన్ని అదుపు చేయ‌క‌పోతే మ‌ర‌ణాల సంఖ్య రెండు రెట్లో, మూడు రెట్లో పెరుగుతుంది. క‌రోనాను కంట్రోల్ చెయ్యాలంటే క‌నీసం రెండు వారాల పాటు లాక్‌డౌన్ అవ‌స‌రం. అమెరికాలో 8 వారాలు చేశారు. స్పెయిన్‌లో 8 వారాలు, ఇట‌లీలో 8 వారాలు చేశారు. చైనాలో ఒక నెల లాక్‌డౌన్ చేస్తే కానీ దాన్ని కంట్రోల్ చేయ‌లేక‌పోయారు. మ‌నం కూడా కంట్రోల్ చెయ్యాలంటే రెండు వారాల లాక్‌డౌన్ త‌ప్ప‌నిప‌రిగా అవ‌స‌రం. లాక్‌డౌన్ అంటే ప్ర‌జ‌ల‌కు అర్థం కావ‌ట్లేదు. ప్ర‌ధాని మోదీ గారు 5 గంట‌ల‌కు క్లాప్స్ కొట్ట‌మంటే జ‌న‌మంతా క్లాప్స్ కొట్ట‌డానికి రోడ్డుమీద‌కు వ‌చ్చేశారు. ముంబైలో ఒక కాల‌నీ వాళ్ల‌యితే ర్యాలీలాగా చేశారు. అంటే ఏం చెప్తున్నా వాళ్ల‌కు ఏమీ అర్థం కావ‌ట్లేదు. లాక్‌డౌన్‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకోవాలి. అది క‌చ్చితంగా అవ‌స‌రం. ర‌వాణా సౌక‌ర్యాల‌న్నింటినీ ఆపేస్తున్నారు.

మ‌నం ఇద్ద‌రి మాట‌ల‌ను త‌ప్ప‌కుండా వినాలి.. ఒక‌రు పోలీస్‌, ఇంకొక‌రు డాక్ట‌ర్‌. వాళ్లు ఏం చెబితే దాన్ని మనం క‌చ్చితంగా పాటించాలి. త‌ప్ప‌దు. లాక్‌డౌన్ అంటే మ‌న‌కు చాలా క‌ష్టంగా ఉంటుంది. అస్స‌లు న‌చ్చ‌దు. అయినా త‌ప్ప‌దు. ఆ టైమ్‌లో పుస్త‌కాలు చ‌దువుకోండి లేదా సినిమాలు చూడండి. దీన్ని చాలెంజ్‌గా తీసుకొని అంద‌రికీ చెప్పండి. లేదంటే పిల్ల‌ల‌తో, పెంపుడు జంతువుల‌తో ఆడుకోండి. ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని దేశానికి సేవ చేసే టైమ్ వ‌చ్చింది. ద‌య‌చేసి ఆ ప‌ని చేయండి. ఇంట్లో కూర్చోండి, దేశాన్ని కాపాడండి” అని విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -