రియో ఒలింపిక్స్‌లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రజత పతక విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, కాంస్య పతక విజేత.. రెజ్లర్ సాక్షి మాలిక్‌లతో పాటు 52 ఏళ్ల తర్వాత దేశం తరఫున జిమ్నాస్టిక్స్‌లో పాల్గొని తృటిలో పతకం చేజార్చుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, సింధు కోచ్ గోపిచంద్‌లకు సచిన్ టెండల్కర్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. చాముండేశ్వరినాథ్ ఫౌండేషన్ తరపున ఈ బహుమతులను సచిన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. అయితే జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఊహించని నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అందుకున్న బహుమతి బీఎండబ్ల్యూ కారును వెనక్కి తిరిగిచ్చేయాలని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నిర్ణయించుకుంది.
బీఎండబ్ల్యూ కారును మెయింటెన్ చేసే స్థోమత లేకపోవడం వల్లే దీపా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. త్రిపురకు చెందిన దీపా అగర్తలలో నివసిస్తుంది. అగర్తల రోడ్లు సరిగ్గా ఉండవట. రోడ్లపై గుంతలు.. ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి రోడ్లపై ఈ కారును నడపడం దీపాకు ఇష్టం లేకపోవడం.. అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేకపోవడంతో దీపా బహుమతిని తిరిగిచ్చేయాలనే నిర్ణయానికి దీపా వచ్చిందని ఆమె కోచ్ నంది తెలిపారు. ఈ విషయాన్ని కారుని బహుమతిగా అందించిన చాముండేశ్వరి నాథ్ కి కూడా తెలిపినట్లు కోచ్ తెలిపారు. దీనికి చాముండేశ్వరి నాథ్ కూడా సానుకూలంగా స్పందించారు. కారుని పంపితే, ఆ కారు ఖరీదుని దీపా అకౌంట్లో వేస్తానని తెలిపారని చెప్పారు.